రాజ్యసభ సభ్యత్వానికి వైఎస్సార్ సీపీ నేత వి. విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌కు విజయసాయిరెడ్డి తన రాజీనామా పత్రం సమర్పించారు. వ్యక్తిగత కారణాలతో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు విజయసాయిరెడ్డి శుక్రవారం సంచలన ప్రకటన చేశారు. చెప్పినట్లుగానే శనివారం నాడు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయగా, తన రాజీనామాను ఉపరాష్ట్రపతి వెంటనే ఆమోదించారని విజయసాయిరెడ్డి తెలిపారు.

అనంతరం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడా. ఆ తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నాను. వెన్నుపోటు వ్యాపారాలు, వెన్నుపోటు రాజకీయాలు నాకు తెలియవు. రాజకీయాల నుంచి కేసుల నుంచి ఎందుకు తప్పిస్తారు. నేను అబద్ధం చెప్పడం లేదు. నా మీద ఎలాంటి ఒత్తిడి లేదు. ఏదైనా ఉంటే ధైర్యంగా ఎదుర్కొనే తత్వం నాది. కేసులకో, ఎవరికో భయపడే వ్యక్తిని కాదు. భయమనేది నా బ్లడ్ లోనే లేదు. పదవికి న్యాయం చేయడం లేదని భావించి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నాను. ఎవరికైనా దమ్ముంటే నేను డబ్బులు తీసుకుని రాజీనామా చేసినట్లు నిరూపించండి’ అని విజయసాయిరెడ్డి సవాల్ విసిరారు.