ప్రధాని పదవితో పాటు లిబరల్ పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటానని కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో గతవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కెనడా ప్రధాని రేసులో ఉన్న మొదటి ఐదుగురిలో ప్రస్తుత రవాణా మంత్రి, భారత సంతతి మహిళా ఎంపీ అనితా ఇందిరా ఆనంద్ పేరు కూడా ఉంది. తాజాగా, అనిత కీలక ప్రకటన చేశారు. కెనడా ప్రధాని రేసు నుంచి తాను తప్పుకొంటున్నట్లు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం ఓక్‌విల్లే ఎంపీగా అనిత..
తాను మళ్లీ ఎన్నికవ్వాలని కోరుకోవట్లేదని తెలిపారు. కానీ, వచ్చే ఎన్నికల వరకు ఉన్న తన బాధ్యతలను నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు. పార్లమెంటు సభ్యురాలిగా లిబరల్ టీమ్‌లో తనకు అవకాశం ఇచ్చినందుకు.. .కీలక శాఖలను అప్పగించినందుకు ట్రూడోకు, తనను ఎన్నుకున్నందుకు ఓక్‌విల్లే ప్రజలకు అనిత కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులో విద్యారంగంలో సేవలు అందించాలని అనుకుంటున్నట్టు అనిత తెలిపారు.

‘‘దేశానికి, సమాజానికి మనం అనేక విధాలుగా సేవ చేయవచ్చు. కెనడాను సురక్షితంగా, బలంగా, స్వేచ్ఛగా ఉంచడానికి ఓ ప్రజా ప్రతినిధిగా నేను చేయాల్సినవన్నీ చేశాను.. .నేను పుట్టడానికి ముందే కెనడాకు వలస వచ్చిన నా తల్లిదండ్రులు.. ఈ దేశ గొప్పదనం..
మాకు అందించిన సహకారాన్ని చెబుతూ పెంచారు. కాబట్టి మా లిబరల్ పార్టీ కోసం, ఓక్‌విల్లే కోసం..అన్నింటి మించి కెనడా కోసం నేను ఇక్కడ ఉంటాను’’ అని అనిత చెప్పారు. తాను మొదటిసారి ఎన్నికల్లో పోటీచేసినప్పుడు భారత సంతతి మహిళ గెలవలేదని ప్రచారం చేశారు. కానీ, అక్కడి ప్రజలు మాత్రం తనను ఒకటి కాదు రెండుస్లారు గెలిపించారని చెప్పారు. దీనిని ఎంతో గౌరవంగా భావించి.. జీవితాంతం నా గుండెల్లో పెట్టుకుంటానని అన్నారు.
ట్రూడో వారసుడ్ని నాయకుడిని ఎన్నుకునే పనిలో లిబరల్ పార్టీ నిమగ్నమైంది.