మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయి..మరోసారి నవ్వులపాలైందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి 251 స్థానాల్లో విజయం సాధించి కాంగ్రెస్ ను చిత్తూ చేసింది. కాంగ్రెస్ ఉచిత పథకాలకు ప్రజలు ఏమాత్రం ఇష్టపడలేదు. ఈ ఫలితాలతో బిజెపికి ఇక తిరుగులేదని మరోసారి రుజువైనట్లు అయ్యింది. ఈ ఫలితాలపై కిషన్ రెడ్డి స్పందించారు.
దేశ ప్రజల ముందు కాంగ్రెస్ మరోసారి నవ్వులపాలైందని, ఇండియా కూటమికి మహారాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. రాహుల్‌గాంధీ విద్వేష ప్రచారం చేశారని, కులం, మతం పేరుతో ప్రజలను విడగొట్టే ప్రయత్నం చేసినా మహారాష్ట్రలో బీజేపీ హ్యాట్రిక్ కొట్టిందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ప్రచారం, ఆయన పంపిన డబ్బులు మహారాష్ట్రలో పని చేయలేదని వ్యాఖ్యానించారు. గ్యారంటీలతో మోసం చేసిన కాంగ్రెస్ తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లకే పరిమితమైందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. గత ఎన్నికల్లో సొంతంగా 44 సీట్లు గెలిచిన కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రేతో పొత్తు పెట్టుకున్న తర్వాత కనీసం సగం సీట్లు కూడా సాధించలేకపోయిందని అన్నారు. ఎమ్మెల్యేలను తెలంగాణ, కర్ణాటకకు తరలించాలని ప్లాన్ చేశారని పేర్కొన్నారు. రాజకీయ అవకాశవాదం తలకెక్కిన ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్, కాంగ్రెస్‌కు మహారాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు.
ఈవీఏంల ట్యాంపరింగ్ జరిగిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కాంగ్రెస్ గెలవకపోతే ఈవీఏంల ట్యాంపరింగ్ జరిగినట్లా అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్‌తో జతకట్టిన ఉద్ధవ్ ఠాక్రేకు ప్రజలు బుద్ధి చెప్పారని, మహారాష్ట్ర ప్రజలు వారసత్వాన్ని చూడలేదని పేర్కొన్నారు.