ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆంధ్ర అబివృద్దికి కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏపీకి వరాలు కురిపించనున్నారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతల స్వీకరణ తరువాత తొలి సారి ఏపీకి వస్తున్నారు. దాదాపు రూ రెండు లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను మోదీ శంకుస్థాపన చేస్తారు. విశాఖ నగరంలో చంద్రబాబు, పవన్ తో కలిసి దాదాపు రెండు కిలో మీటర్ల మేర రోడ్ షో లో పాల్గొంటారు. బహిరంగ సభలో ప్రధాని పర్యటన పైన ఆసక్తి నెలకొంది. డబుల్ ఇంజన్ సర్కార్ లో విశాఖ కేంద్రంగా ప్రధాని మోదీ టూర్ ఏపీ భవిష్యత్ కు కీలక మలుపుగా మారే అవకాశం కనిపిస్తోంది.

ప్రధాని స్వయంగా ట్వీట్
మోదీ టూర్ పై ఆసక్తి ప్రధాని మోదీ ఈ రోజు విశాఖ పర్యటనకు వస్తున్నారు. ఈ మేరకు స్వయంగా ప్రధాని తన విశాఖ పర్యటన పైన ట్వీట్ చేసారు. దీనికి సీఎం చంద్రబాబు స్పందిస్తూ.. ప్రధానికి స్వాగతం పలికేందు కు నిరీక్షిస్తున్నామని పేర్కొన్నారు. ప్రధాని పర్యటనలో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఏర్పాటుచేసే గ్రీన్ హైడ్రోజన్ హబ్ విలువే రూ.1.85లక్షల కోట్లు. రహదారులు, రైల్వే పనుల అంచనా రూ.19.5 వేల కోట్లు. వీటితోపాటు మరో 10కి పైగా ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఆరు రహదారులు, రైల్వే లైన్లు జాతికి అంకితం చేస్తారు. ఏయూ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు.