| రోమింగ్ ఛార్జీలు తగ్గించిన ఎయిర్‌టెల్ |
| శని వారం, నవంబర్ 21, 2009 , 1:50 [IST] |
 |
|
బిజినెస్‌బ్యూరో,హైదరాబాద్,నవంబర్20: ఎయిర్‌టెల్ రోమింగ్ ఛార్జీలను 60 శాతం తగ్గించింది. దేశవ్యాపితంగా ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని ఏపి సర్కిల్ సిఇఓ శర్లిన్ థైయిలీ తెలిపారు. ఎయిర్‌టెల్ టర్భో ప్లాన్ పేరుతో రోమింగ్ ఛార్జీలను ఎయిర్‌టెల్ తగ్గించింది. రోమింగ్ సమయంలో ఎయిర్‌టెల్ నుంచి ఎయిర్‌టెల్‌కు చేసే కాల్స్‌కు 50 పైసలు, ఎస్‌టిడి, ఇతర మొబైల్స్, ల్యాండ్‌లైన్స్‌కు చేసే కాల్స్‌కు 60 పైసలు వసూలు చేస్తామని థైయిలీ తెలిపారు. ఇన్‌కమింగ్ కాల్స్ ఎయిర్‌టెల్ నెట్ వర్క్ నుంచి అయితే 60 పైసలు, ఇతర నెట్‌వర్క్‌లు, ల్యాండ్‌లైన్ కాల్స్‌కు 80 పైసలు వసూలు చేస్తారు. తగ్గింపు ఛార్జీల కోసం ఎయిర్‌టెల్ కస్టమర్లు టర్భో ప్లాన్‌లో తమ నెంబర్లను నమోదు చేసుకోవాల్సి వుంటుందని ఆయన వివరించారు.
ఇందు కోసం ప్రీపెయిడ్ కస్టమర్లు 98 రూపాయలు చెల్లిస్తే, ఈ ప్లాన్ సంవత్సరం పాటు చెల్లుబాటులో ఉంటుంది.పోస్ట్‌పెయిడ్ కస్టమర్లు కూడా ఈ ప్లాన్‌ను వినియోగించుకోవచ్చని చెప్పారు. టారీఫ్ తగ్గించడానికి ముందు ఇన్‌కమింగ్ కాల్‌కు ఒక రూపాయి, అవుగోయింగ్ కాల్స్‌కు 1.50 రూపాయలు వసూలు చేసేవారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎయిర్‌టెల్‌కు 1.2 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. రాష్ట్రంలో 90 శాతం ఏరియాను ఎయిర్‌టెల్ కవర్ చేస్తోందని తెలిపారు.
అరకులోయలో కవరేజ్ కోసం శాటిలైట్ లింక్‌ను వినియోగిస్తున్నట్లు తెలిపారు.ఇలాంటి మరికొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లోనూ శాటిలైట్ సహాయంతో లింక్ చేయనున్నట్లు తెలిపారు. సెల్‌టవర్ నిర్మాణానికి చుట్టుపక్కల ఉన్న వారి అనుమతి కూడా తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించడం వల్ల కొన్ని సమస్యలు వస్తున్నాయని, దీన్ని పరిష్కరించేందుకు కషి చేస్తున్నట్లు చెప్పారు. దీని వల్ల కొత్త టవర్ల నిర్మాణంలో జాప్యం జరుగుతుందన్నారు.
|
|
|
|
|
|
|