న్యూఢిల్లీ : లిబర్హాన్ కమిషన్ నివేదికను సమర్పిం చాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తామని సమాజ్‌వాది పార్టీ హెచ్చరించింది. బాబ్రీమసీదు కూల్చివేత కేసులో కాంగ్రెస్ ప్రమేయం కూడా ఉన్నట్లు తేలడంతో కమిషన్ నివేదికను పార్లమెంట్‌కు సమర్పించడంలో జాప్యం చేస్తున్నారని ఆరోపించింది. ''పదిహేడు సంవత్సరాల క్రితం ఏర్పాటైన లిబర్హాన్ కమిషన్ నివేదికను బహిర్గతం చేయాల్సిఉంది. బాబ్రీమసీదు కూల్చివేత పాపంలో బిజెపి నాయకుడు ఎల్.కె. అద్వానీ, కళ్యాణ్‌సింగ్, ఉమాభారతి (ఈ ఇద్దరూ బిజెపి మాజీ సభ్యులు)తోపాటు కాంగ్రెస్‌కు కూడా భాగస్వామ్యం ఉన్నందువల్లే నివేదికను ప్రవేశపెట్ట డంలేదు అని ఎస్‌పి ప్రధాన కార్యదర్శి అమర్‌సింగ్ పార్లమెంట్ శీతాకాలపు సమావేశాల తోలిరోజున సభ వెలుపల విలేకరులతో అన్నారు. నివేదికను ఈ సమావేశాల్లోనే సమర్పించనట్లయితే, పార్లమెంట్ సభాకార్యక్రమాలకు అంతరాయం కల్పిస్తామని ఆయన చెప్పారు. అంబానీ సోదరుల గ్యాస్ వివాదంతో పోల్చితే మసీదు కూల్చివేతపై విచారణను త్వరితగతిన ఎందుకు చేపట్టలేదో తనకు అర్ధం కావడంలేదని అన్నారు.