|
న్యూఢిల్లీ నవంబర్ 3:- గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల కొనుగోలు శక్తి ఇటీవలి కాలంలో బాగా పెరిగినట్లు అధ్యయనాలు తెలియచేస్తున్నాయి. గత 12 సంవత్సరాల్లో గ్రామీణ ప్రాంతాల్లో నెలకు తలసరి వినియోగ వ్యయం 122 శాతం పెరిగినట్లు తేలింది. మొబైల్ టెలిఫోన్లు గ్రామీణ ప్రాంతాల్లో విస్తరించడం, కేబుల్ టివీ ప్రభావం వల్ల ప్రజల ఆలోచనధోరణిలో చాలా మార్పులు వస్తున్నాయి. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో విద్యా స్థాయి కూడా బాగా మారుతుంది. ఇటీవలి కాలంలో వ్యవసాయోత్పత్తుల ధరలు పెరగడం కూడా పరోక్షంగా రైతాంగానికి ఉపయోగపడింది. అంతర్జాతీయంగా ఏర్పడిన ఆర్థిక మాంద్య ప్రభావం ఇండియా గ్రామీణ ప్రాంతాలపై పెద్దగా పడలేదని పరిశీలకులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 50 శాతం ఆదాయం వ్యవసాయ రంగం నుంచి ఇతర ఆదాయం వ్యవసాయేతర రంగాల నుంచి వస్తున్నది. వ్యవసాయ రంగం అంతర్జాతీయ ఆర్థిక మాంద్య ప్రభావం లేకుండా ముందుకు వెళ్లుతున్నది. అయితే వ్యవసాయేతర ఆదాయంలో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా ప్రవాసుల నుంచి ఇండియాలో తమ కుటుంబాలకు వచ్చే ఆదాయం తగ్గింది. ప్రభుత్వం వ్యవసాయోత్పత్తుల కనీస మద్దతు ధర పెంచడం వల్ల వ్యవసాయ ఆదాయాలు పెరుగుతున్నాయి. అలాగే మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూడా వ్యవసాయ కూలీల ఆదాయం పెరగడానికి దోహదం చేసింది. వ్యవసాయంలో ఉపయోగించే పనిముట్లు, ఎరువులకు డిమాండు పెరుగుతుంది. అలాగే ఇంధనానికి కూడా గిరాకీ పెరిగింది.
|