|
న్యూఢిల్లీ నవంబర్ 3:- అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా 670 కోట్ల డాలర్ల ఖర్చుతో 200 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. దీనితో రిజర్వుబ్యాంకు వద్ద ఉన్న బంగారు నిల్వలు 55 శాతం పెరిగాయి.
1991 సంవత్సరంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడటంతో ఇండియా విదేశీ రుణాలను తీర్చుకోవడానికి బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌లో కుదువపెట్టాల్సి వచ్చింది. అయితే ప్రస్తుతం 200 టన్నుల బంగారాన్ని అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి కొనుగోలు చేసినట్లు ఆర్‌బిఐ తెలియచేసింది.
రిజర్వు బ్యాంకుకు అప్పుడప్పుడు బంగారం కొనుగోలు చేయడం సాధారణమేనని, ఐఎమ్‌ఎమ్ బంగారాన్ని విక్రయిస్తున్న తరుణంలో 200 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి ప్రణబ్‌ముఖర్జీ న్యూఢిల్లీలో తెలియచేసారు.
బంగారం కొనుగోలుచేయడం ఇండియాకు పెరుగుతున్న ఆర్థిక పట్టుత్వానికి సంకేతామా అని అడిగిన ప్రశ్నకు ఎవరి అభిప్రాయం వారిదే అని ఆయన ముక్తసమాధానం చెప్పారు. అయితే రిజర్వుబ్యాంకు బంగారం అంతర్జాతీయంగా అధిక ధర ఉన్న తరుణంలో కొనుగోలు చేయడం సమంజసమా అన్న అంశం కాలమే నిర్ణయిస్తుంది.
అంతర్జాతీయ ద్రవ్య నిధి పేద దేశాలకు తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వడానికి నిధులు పెంచుకునే ప్రయత్నంలో ఉంది. ఆ నిధులు పెంచుకునే ప్రయత్నంలో భాగంగా బంగారాన్ని విక్రయించింది. అక్టోబరు 19-30 తేదీల మధ్య కాలంలో రెండు వారాల సమయంలో ఈ బంగారం కొనుగోలు ఉభయ అధికారిక వర్గాల మధ్య జరిగింది. ఈ బంగారం కొనుగోలుతో రిజర్వుబ్యాంకు వద్ద ఉన్న 357 టన్నుల బంగారం 507 టన్నులు అవుతుంది. ప్రస్తుతం బ్యాంకు వద్ద ఉన్న 357 టన్నుల బంగారం విలువ 960 కోట్ల డాలర్లుగా అంచనా వేస్తున్నారు.
ఇందులో 65 టన్నుల బంగారాన్ని 1991 నుంచి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్‌నేషనల్ సెటిల్‌మెంట్ వద్ద కుదువపెట్టారు. 1991లో ఏర్పడిన విదేశీ మారక సంక్షోభాన్ని పరిష్కరించడానికి అనేక చర్యలు తీసుకోవడంతో పాటు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వద్ద ఈ బంగారాన్ని కుదువ పెట్టి ఇండియా నిధులను సమీకరించింది. గల్ఫ్‌లో ఏర్పడిన సంక్షోభంతో 1991 మార్చి 31 నాటికి ఇండియా వద్ద విదేశీ మారకం నిల్వలు 580 కోట్లకు పడిపోయాయి.
అయితే ఇండియా ఆర్థిక సంస్కరణలను చేపట్టిన తర్వాత విదేశీ మారకం నిల్వలు పెరగడం ప్రారంభమై 2008 మే నాటికి 314.61 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇండియా వద్ద విదేశీ మారకం నిల్వలు ఇంత అత్యధిక స్థాయికి చేరుకోవడం మరెన్నడు జరగలేదు. 2009 సెప్టెంబర్ 25 నాడు ఇండియా వద్ద 280 బిలియన్ డాలర్ల నిల్వలు ఉన్నాయి. ఈ సమయంలోనే ఐఎమ్‌ఎఫ్ నుంచి బంగారం కొనుగోలు చేయాలని ఇండియా నిర్ణయించింది.
జి-20దేశాలు లండన్‌లో సమావేశం అయినప్పుడు తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఐఎమ్‌ఎఫ్ 403.3 మెట్రిక్ టన్నుల బంగారాన్ని విక్రయించాలని నిర్ణయించింది. అలా సమీకరించిన నిధులను పేద దేశాలకు తక్కువ వడ్డీకి రుణాలుగా ఇవ్వాలని కూడా నిర్ణయం జరిగింది. ఈ లావాదేవీతో ఐఎమ్‌ఎఫ్ ఆర్థికపరిస్థితి కూడా పటిష్టం అవుతుందని ఐఎమ్‌ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ డొమినిక్ స్ట్రాస్ - కహన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
|